4 నుంచి జగన్ ప్రభుత్వంపై బీజేపీ రణభేరి  

‘‘రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల మీద రణభేరి మోగిస్తున్నాం. అక్టోబర్‌ 4 నుంచి వరుస నిరసనలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై గాంధేయవాద పద్ధతిలో పోరాటం చేయబోతున్నాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ విధానం వల్ల ఇసుక బ్లాకులో మాత్రమే లభిస్తోందని ధ్వజమెత్తారు. ఇసుకను ఆపేయడం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని మండిపడ్డారు. 

కూలీలతో కలిసి ఈ నెల 7న బీజేపీ బిక్షాటన చేస్తుందని కన్నా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను జగన్‌ ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదని కన్నా ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో అభాసుపాలైన జగన్‌ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయకుండా వేలాది మంది అవకాశాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. 

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు అక్టోబర్‌ 4న బీజేవైఎం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడానికి అక్టోబరు 11న పోలవరం వెళుతున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రాగలమని పేర్కొన్నారు. 

కాగా, గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15 నుండి 30 వరకు పలు సేవాకార్యక్రమాలను బిజెపి కార్యకర్తలు చేపట్టనున్నట్లు కన్నా వెల్లడించారు. దీనిలో భాగంగా పార్లమెంట్ సభ్యులు తమకు కేటాయించిన ప్రాంతాలలో 150 కిమీ మేర పాదయాత్రలు చేయగలరని తెలిపారు.