తెలంగాణలో ప్రచారానికి నోచుకోని కేంద్ర పథకాలు

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద ఏటా కోట్లాది రూపాయలు గ్రాంట్‌గా ఇస్తున్నప్పటికీ, వీటికి తగినంత ప్రచారం లభించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో కేంద్రం వాటా భారీగా ఉంటోంది. 2019-20 సంవత్సరంలో వివిధ ఫథకాలు, కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ  27,000 కోట్లు ఇస్తోంది. గత ఏడాది దాదాపు రూ 30,000 కోట్లు విడుదల చేసింది. అంతకు ముందు సంవత్సరం రూ 24,000 కోట్లు విడుదల చేసింది. 

వీటిలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా కాకుండా, గ్రాంట్‌గా విడుదల చేసే నిధులు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, నేషనల్ రూరల్ లైలీహుడ్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గ్రామ సడక్ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, ప్రధాన మంత్రి కల్యాణ్ సమ్మాన్ నిధి తదితర పథకాల కింది భారీగా నిధులు లభిస్తున్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ ఏడు తెలంగాణకు రూ 1749 కోట్లు కేంద్రం కేటాయించింది. గత మూడు సంవత్సరాల్లో ఈ పథకం కోసం రూ 7,000 కోట్లు విడుదలయ్యాయి. బాగా ప్రచారం పొందిన కేసీఆర్ కిట్స్ పథకానికి దాదాపు రూ 6,000 కోట్లు కేంద్రమే ఇస్తోంది. ఈ పథకం ప్రచారంలో ప్రధాన మంత్రి ఫోటో గాని, కేంద్ర ఆరోగ్య మంత్రి ఫోటో కాని ఉండటం లేదు. రాష్ట్ర పాలకుల ఫోటోలే ప్రధానంగా దర్శనం ఇస్తున్నాయి. 

డబల్ బెడ్‌రూం పథకం, మధ్యాహ్న భోజన పథకం తదితర పథకాలకు కూడా కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ, ప్రచారం లభించడం లేదు. వ్యవసాయ రంగంలో ఒక్కో రైతుకు కేంద్రం ఏటా రూ 6000  ఇస్తున్నప్పటికీ, దానికి ప్రచారం లభించడం లేదు. అలాగే ఉద్యాన శాఖకు కేంద్రం రూ 9.31 కోట్లు ఇస్తుండగా రాష్ట్రం తనవాటాగా మరో రూ 9 కోట్లు కేటాయించింది. 

వ్యవసాయ రంగానికి రాష్ట్రం రూ 14,000 కోట్లు కేటాయించగా, ఇందులో కేంద్రం వాటా సగం మేరకు ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే విధంగా ఇతర శాఖల పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితిలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం లభించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయత్నిస్తోంది.