హుజూర్‌నగర్‌ గెలుపు బాధ్యత కిషన్ రెడ్డిదే   

తెలంగాణ బిజెపి ప్రతిష్టాకరంగా తీసుకున్న హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేపట్టారు. 17 మంది సీనియర్ నేతలతో కిషన్ రెడ్డి సారధ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు నియమితులయ్యారు. మరో 12 మంది సీనియర్‌ నేతలతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీకి సంకినేని వెంకటేశ్వర్‌రావు నేతృత్వం వహించనున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అధ్యక్షతన ఆదివారం రాత్రి పార్టీ కోర్‌ కమిటీ సమావేశమై.. ప్రచార వ్యూహంపై చర్చించింది. ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీలకు సీనియర్‌ నేతలను ఇన్‌చార్జులుగా నియమించారు. 

బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ కోట రామారావు పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆదివారం రాత్రి ఆయన పేరును అధికారికంగా వెల్లడించారు. రామారావు ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ, ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేశారు. ఆయన తండ్రి కోట రంగయ్య గ్రామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘానికి మూడుసార్లు చైర్మన్‌గా వ్యవహరించారు.

కాగా, ఈ ఉపఎన్నికలో విజయం కోసం అధికార టీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున అధికారా దుర్వినియోగంపై పాల్పడుతున్నట్లు బిజెపి సమావేశం విమరింశించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహితం అధికార పార్టీకి వంతపాడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని, అధికార పార్టీకి సహకరిస్తున్న అధికారుల విషయం కూడా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.