వృద్ధిరేటు లో బీహార్ కన్నా వెనుకబడిన తెలంగాణ 

`బంగారు తెలంగాణ' అంటూ కాలక్షేపం చేస్తున్న కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడుతున్నది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో వెనుకబడిన ప్రాంతంగా పరిగణించే బీహార్ కన్నా వెనుకబడింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సహితం తెలంగాణను దాటేసింది. 

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్​డీపీ: గ్రాస్​ స్టేట్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​) వృద్ధి రేటులో తెలంగాణ నాలుగో స్థానానికి పడిపోయింది. వృద్ధి రేటు 14.84 శాతంగా నమోదైంది. ఈ జాబితాలో 17.81 శాతం వృద్ధితో పశ్చిమబెంగాల్​ ఫస్ట్​ ర్యాంకు సాధించింది. 15.3 శాతం వృద్ధితో ఏపీ రెండు, 15.01 శాతంతో బీహార్​ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 

నిజానికి కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టిన జులై 4 నాటికి ఆర్థిక సర్వే నివేదికలో 18 రాష్ట్రాల జీఎస్​డీపీ వృద్ధి రేటును చెప్పలేదు. అప్పటికి సమాచారం అందుబాటులో ఉన్న 11 రాష్ట్రాల వృద్ధితో పోలిస్తే తెలంగాణ టాప్​లో నిలిచింది. అయితే, గతంలో మిస్సైన రాష్ట్రాల్లోని 9 రాష్ట్రాల జీఎస్​డీపీ వృద్ధి రేటు వివరాలను కేంద్రం ఇటీవల జత చేసింది. 

దీంతో ఆయా రాష్ట్రాల గ్రోత్​ రేట్​నూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్​డీపీపై సామాజిక ఆర్థిక పరిస్థితులతో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం గతంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మూడు స్థానాలు తగ్గి నాలుగో స్థానానికి పడిపోయింది. గుజరాత్​, మహారాష్ట్ర తదితర పది రాష్ట్రాల సమాచారమూ అందుబాటులోకి వస్తే జీఎస్​డీపీ వృద్ధి రేటులో రాష్ట్రం స్థానం మరింత పడిపోయే అవకాశం ఉంది. 

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఐదేళ్ల సగటు వృద్ధి రేటు 14.99 శాతంగా నమోదైంది. తెలంగాణ వృద్ధి రేటు మాత్రం 13.9 శాతమే ఉంది. తాజా లెక్కల ప్రకారం 2018–19 సంవత్సరానికిగానూ రాష్ట్ర సంపద రూ  8.66  లక్షల కోట్లు కాగా, ఏపీది రూ 9.33 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక రాష్ట్రాభివృద్ధికి జీఎస్​డీపీనే లెక్కలోకి తీసుకుంటారు. దాని ప్రకారమే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తారు. 

తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మూడేళ్లుగా జీఎస్​డీపీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. 2016–17లో  18.4 శాతం వృద్ధి రేటు సాధించగా, 2017–18లో 14.4 శాతం, 2018–19లో 9.6 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది.