మరో పదేండ్లలో సరికొత్త కశ్మీర్‌

జమ్ముకశ్మీర్‌ అంశంపై మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం ‘హిమాలయాలంత తప్పు’ అని కేంద్ర హోమంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రపంచం మొత్తం మద్దతు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్‌లో నిర్బంధం లేదని, మరో పదేండ్లలో రాష్ట్ర చరిత్రను తిరగరాస్తామని స్పష్టం చేశారు. 

ఢిల్లీలోని నెహ్రూ స్మారక మ్యూజియం అండ్‌ లైబ్రరీలో ‘జాతీయ భద్రత’ అంశంపై సంకల్ప్‌ మాజీ సివిల్‌ సర్వెంట్స్‌ ఫోరం నిర్వహించిన సదస్సులో అమిత్‌షా ప్రసంగిస్తూ ‘జమ్ముకశ్మీర్‌ విషయంలో గతంలో చాలా తప్పులు జరిగాయి. ఇన్నాళ్లూ తప్పులు చేసినవారి చేతిలోనే చరిత్ర రాసే బాధ్యత కూడా ఉండటంతో వాస్తవాలు మరుగున పడిపోయాయి’ అని పేర్కొన్నారు. 630 సంస్థానాలను సర్దార్‌ పటేల్‌ దేశంలో ఐక్యం చేయగా, జమ్ముకశ్మీర్‌ అంశం ఒక్కటే 1947 నుంచి అలాగే ఉండిపోయిందని గుర్తుచేశారు. 

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో అభివృద్ధికి బాటలు పడుతుందని, మరో పదేండ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిలుస్తుందని దీమా వ్యక్తంచేశారు. ఇప్పుడు మానవహక్కుల గురించి మాట్లాడుతున్నవారు దశాబ్దాలనాటి ఉగ్రవాదానికి జమ్ముకశ్మీర్‌లో 41,800 మంది చనిపోయినప్పుడు, కశ్మీరీ పండిట్లతోపాటు సూఫీ సన్యాసులను తరిమికొట్టినప్పుడు ఎక్కడికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ప్రస్తుతం కశ్మీర్‌లో ఎలాంటి నిర్బంధం లేదని, 196 పోలీస్‌స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేశామని, కేవలం 8 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నదని తెలిపారు.