ఏపీలో  ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు మాత్రమే  

రాష్ట్రంలో పాలన లేదని,  ఉన్నదల్లా కేవలం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు మాత్రమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. దేవుడి భూములకు రక్షణ లేదని, ఇళ్ల నిర్మాణాలకు ఇసుక లేదని, భవన కూలీలకు పనిలేదని ధ్వజమెత్తారు.  కన్నా నేతృత్వంలో బీజేపీ బృందం శనివారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి, జగన్‌ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. 

అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తగినంత పనిలేక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రలో పోలీసుల తీరుందని మండిపడ్డారు. ఇసుకను దిగుమతి చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని దుయ్యబట్టారు. 

‘‘ఆహారం కొరత, నీటి ఎద్దడి లాంటివి ఎక్కడైనా వస్తుంటాయి. కాని రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత వచ్చింది. ప్రభుత్వమే కొరతను సృష్టించి బ్లాక్‌లో కొనేలా చేయడం దారుణం. ఇళ్లు నిర్మించుకోవడానికి మధ్య తరగతి ఇబ్బందులు పడుతోంటే భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులు ఉంటున్నారు. స్వలాభం కోసం ప్రజల్ని ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది" అని కన్నా విమర్శించారు. 

పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కక్షి సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. "మా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి, వారి బాధలు వింటే తక్షణమే పోలీసుల నుంచి చర్యలు ఉంటున్నాయి. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో అడ్డా కూలీల సమస్యలని తెలుసుకోడానికి పార్లమెంటు స్థాయి బీజేపీ నాయకుడు ఆగారు. కాసేపటికే పోలీసులు ఆయన ఇంటికొచ్చారు. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉందా?" అని కన్నా ప్రశ్నించారు. 

అడ్డా కూలీలు, బీజేపీ నేతలు సంఘ విద్రోహ శక్తులా? మూడు నెలలకే ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తోంటే ఇక ఐదేళ్లు ఎలా పాలిస్తారో! ఇప్పటికీ ఇసుకను బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది. నాకు అవసరమై గతంలో రూ.10 వేలకు కొన్న లారీ ఇసుకను ఇప్పుడు రూ.30 వేలకు కొన్నా. సీఎం చేతలకు, మాటలకు పొంతనలేదని దుయ్యబట్టారు.

కాగా, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు ప్రధాన అజెండాగా... ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు, 2017లో ఆగిపోయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణను పార్టీలో చర్చిస్తామని కన్నా తెలిపారు. అవసరమైతే విజయవాడలో ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్‌ రాష్ట్రంలో అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొంటోందని విమర్శించారు. 

సచివాలయ పరీక్షల్లో ప్రభుత్వం అపహాస్యం పాలైందని ఎద్దేవా చేశారు. దేవుడి భూములను తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గవర్నర్‌కు విన్నవించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 2 నుంచి పాదయాత్రల ద్వారా బీజేపీ ప్రజల్లోకి వెళ్తుందని కన్నా తెలిపారు.

‘‘ఎన్నికలకు ముందు వైసీపీ రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ఇస్తున్న రూ.6 వేలకు, మరో రూ.6500 లను చేర్చి, మొత్తం తామే ఇస్తున్నట్లు చెప్పుకుంటోంది. ఇది సిగ్గుచేటు" అని కన్నా మండిపడ్డారు. సగం నిధులు కేంద్రం ఇస్తున్నందున ఆ పథకానికి మోదీ పేరు కూడా చేర్చా లి. లేదా రూ.12500 ను రాష్ట్రమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ రెంటిలో ఏదో ఒకటి స్పష్టం చేసేవరకూ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని కన్నా స్పష్టం చేశారు.