బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు కాలం తీరింది 

అరాచకాన్ని సృష్టిస్తూ ఆటవిక పాలన సాగిస్తున్న పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కాలం తీరిందని బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఆటవిక పాలనే సాగుతోందని, రాష్టమ్రంతా భయోత్పాతమే తాండవిస్తోందని శనివారంనాడు  కోల్‌కతాలో  జరిగిన బీజేపీ కార్యక్రమంలో నడ్డా ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టడం తప్ప, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో లక్ష్యమే లేదని ఆయన ఆరోపించారు. 

ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయ హింసాకాండలో మరణించిన బీజేపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా తర్పణాలు వదిలారు. బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులతో కూడా నడ్డా మాట్లాడారు. పార్టీ అన్నివిధాలుగా ఆదుకుంటుందని వారికి ఆయన హామీ ఇచ్చారు. రాష్టల్రో అసలు శాంతి భద్రతలు లేవని, గూండా రాజ్యమే సాగుతోందని దయ్యబట్టారు. హింసాకాండలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు ఇంతవరకు న్యాయం జరుగలేదని ఆయన విమర్శించారు. 

ఇలాంటి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అనంతరం మీడియా మాట్లాడుతూ నడ్డా ప్రకటించారు. తమను వ్యతిరేకిస్తున్న వారిని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శారీరంగా హింసిస్తోందని, గత రెండేళ్లలో 60 మంది ఈ హింసాకాండలో మరణించారని ఆయన తెలిపారు.పోలీసులు కూడా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వౌన ప్రేక్షకుల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని ఆయన దయ్యబట్టారు. 

రక్షించాల్సినవారే భక్షిస్తున్న దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు న్యాయం చేయడం లేదు, అలాగే న్యాయాన్ని పొందేందుకు అవకాశాన్నీ కల్పించడం లేదని ఆయన విమర్శించారు. పశ్చిమబెంగాల్‌లో గూండారాజ్యానికి చరమగీతం పాడి, మరణించిన బీజేపీ కార్యకర్తల ఆత్మకు శాంతి కలిగిస్తామని నడ్డా స్పష్టం చేశారు. 2018 పంచాయతీ ఎన్నికల తర్వాత 3 వేల మంది బీజేపీ కార్యకర్తలు ఇళ్లను ఒదిలి వెళ్లిపోయారని, ఇప్పటికీ వారు ఎక్కడికి వెళ్లారో తనకు తెలియడం లేదని ఆయన తెలిపారు. 

2005 మంది బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, 88 మంది మరణించారని, 1000 మందికి పైగా ఈ దాడుల్లో గాయపడ్డారని వివరాలు వెల్లడించిన నడ్డా ‘రాష్ట్రంలో గూండా రాజ్యం సాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా పునాదులు కదులుతున్నాయని, ముఖ్యమంత్రిగా ఆమెకో దృక్పథమంటూ ఏదీ లేదని నడ్డా మండిపడ్డారు.