జమ్మూలో నవంబరు 17 నుండి పంచాయతీ ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షలీన్‌ కబ్రా ఆదివారం ప్రకటించారు. నవంబరు 17-డిసెంబరు 11 మధ్య 9 దశలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. నవంబరులో 17, 20,24,27, 29 తేదీలలోనూ, డిసెంబరులో 1,4,8,11 తేదీలలోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

బాలెట్‌ పత్రాల ద్వారా ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కబ్రా శనివారం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 13 ఏళ్ళ విరామానంతరం తొలిసారిగా మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి.

ఆర్టికల్‌ 35-ఎపై వివాదం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పీపుల్స్‌ డెమక్రటిక్‌ పార్టీ (పిడిపి), నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సి)లు స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటం గమనార్హం.