టాప్‌ కమాండర్‌ తో పాటు ముగ్గురు ఉగ్రవాదుల హతం  

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ టాప్‌ కమాండర్‌ ఒసామాను సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలు శనివారం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఒసామాతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్‌ ఇదే. తొమ్మిది గంటలకుపైగా ఇది కొనసాగింది. ఒక కుటుంబాన్ని ఉగ్రవాదుల చెరనుంచి కాపాడింది. ఈ క్రమంలో జవాన్‌ రాజేందర్‌ సింగ్‌ వీరమరణం పొందారు. 

లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆనంద్‌, జమ్ము ఐజీపీ ముఖేష్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాంబన్‌ జిల్లా బటోటే పట్టణానికి సమీపంలోని జమ్ము-కిస్తెవార్‌ హైవేపై శనివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని ఆపకుండా పోనిచ్చాడు. సమీపంలోని ఆర్మీ చెక్‌పోస్ట్‌కు వెళ్లి అధికారులకు విషయాన్ని వివరించాడు. దీంతో భద్రతాబలగాలు హైవేపై గాలింపు మొదలుపెట్టాయి. 

ధర్ముండ్‌ గ్రామం సమీపానికి చేరుకోగానే ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు బటోటే పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలోకి చొరబడ్డారు. ఇంటియజమాని, స్థానిక బీజేపీ నేత విజయ్‌కుమార్‌, అతడి కుటుంబ సభ్యులను బందీలుగా తీసుకున్నారు. సైనికులు నిర్భంద తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ఉగ్రవాదులను హతం చేయడం, బందీలను విడిపించడమే లక్ష్యంగా ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఎదురుకాల్పులు సాయంత్రం ముగిశాయి. ముందుగా విజయ్‌ కుటుంబ సభ్యులు ఉగ్రవాదుల చెరనుంచి తప్పించుకొని బయటికి రాగా, సైన్యం వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది. చివరికి ఇంటి యజమాని విజయ్‌కుమార్‌ను రక్షించింది. 

ఉదయం నుంచి తొమ్మిది గంటలకుపైగా సాగిన ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసినట్టు లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆనంద్‌ తెలిపారు. వారిని ఒసామా, జహీద్‌, ఫరూఖ్‌గా గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్‌లో జైసల్మేర్‌కు చెందిన రాజేందర్‌ సింగ్‌ అనే జవాన్‌ వీరమరణం పొందినట్టు తెలిపారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.

శనివారం హతమైన ఒసామా పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌. అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అతడి తలపై నగదు బహుమతి కూడా ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడులకు ఒసామా బాధ్యుడు. 

గత ఏడాది ఏప్రిల్‌ 9న ఆరెస్సెస్‌ నేత చంద్రకాంత్‌ శర్మ, అతడి సహచరుడి హత్య, నవంబర్‌ 1న బీజేపీ సీనియర్‌ నేత అనిల్‌ పరిహర్‌, అతడి సోదరుడు అజిత్‌ పరిహర్‌ హత్యలకు ఒసామా నేతృత్వం వహించాడు. వీటితోపాటు కిస్తెవార్‌ పట్టణంలో ఆయుధాలను దొంగిలించిన మూడు కేసుల్లోనూ అతడు నిందితుడుగా ఉన్నాడు.

మరోవంక, శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి జరిగింది. శనివారం మధ్యాహ్నం నగర పరిధిలోని నవకడల్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ 38 బెటాలియన్‌కు చెందిన సైనికులు విధులు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపైకి గ్రనేడ్‌ను విసిరి పారిపోయారు. అయితే గురి తప్పడంతో బాంబు దూరంగా పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.