ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను విచారించడానికి రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు శనివారం ఏర్పాటుచేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబర్‌ 1 నుంచి ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టనున్నది. ధర్మాసనంలో జస్టిస్‌లు ఎస్కే కౌల్‌, ఆర్‌ సుభాష్‌రెడ్డి, బీఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌ సభ్యులుగా ఉన్నారు. 

ఆర్టికల్‌ 370 రద్దు, తదనంతరం వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటుపై అక్టోబర్‌ 1 నుంచి ఈ ధర్మాసనం విచారణ చేపడుతుందని ఓ ప్రభు త్వ అధికారి తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై ఆగస్టు 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. దీనిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపింది. ఈ మేరకు తాజాగా ధర్మాసనం ఏర్పాటైంది. 

ఆర్టికల్‌ 370ని రద్దుచేయడంతోపాటు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

మొట్టమొదటిషన్లుట న్యాయవాది ఎంఎల్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు అనంతరం కశ్మీర్‌కు చెందిన మరో న్యాయవాది షకీర్‌ షబ్బీర్‌ ఆయనకు తోడయ్యారు. జమ్ముకశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేయడం ద్వారా రాష్ట్ర ప్రజల హక్కులను. కాలరాశారని ఆరోపిస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) పార్టీ కూడా పిటిషన్‌ను దాఖలు చేసిం ది. రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఎన్సీ ఎంపీలు మహమ్మద్‌ అక్బర్‌ లోన్‌, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మసూదీ ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు.

ఆర్టికల్‌ 370 అనేది రాజ్యాంగంలో శాశ్వత నిబంధన అని 2015లో నాటి జమ్ముకశ్మీర్‌ హైకోర్టు జడ్డిగా ఉన్న జస్టిస్‌ మసూదీ తీర్పునివ్వడం గమనార్హం. రక్షణశాఖ మాజీ అధికారులు, బ్యూరోక్రాట్లతో కూడిన బృందం కూడా మరో పిటిషన్‌ను దాఖలుచేసింది. ఐఏఎస్‌ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయ పార్టీ నెలకొల్పిన షా ఫైజల్‌, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత షెహ్లా రషీద్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవికాక మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.