టీఆర్‌ఎస్‌లోకి మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌!

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన టీఆర్‌ఎస్‌ నేతలకు దగ్గరయ్యారని చెబుతున్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఆయన గత ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ సీట్ ఇవ్వక పోవడంతో అసంతృప్తితో ఉంటూ వచ్చారు. 

ఈ నేపథ్యంలోనే అజహరుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందడానికి వ్యుహాత్మకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తున్నది. టీఆర్‌ఎస్‌ మద్దుతుతోనే ఆయన హెచ్‌సీఏ పదవిని కైవసం చేసుకున్నారని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక నేత మధ్యవర్తిత్వంలో అజహరుద్దీన్‌ టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారని తెలుస్తోంది. 

హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందిన అజహరుద్దీన్‌.. త్వరలో కేసీఆర్‌ను కలవనున్నట్టు చెప్పడం కూడా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. మరోవైపు అజహరుద్దీన్‌ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సమచారం. 

ఏడాదిలోపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ అజహరుద్దీన్‌ను బలమైన మైనార్టీ నేతగా ప్రొజెక్ట్‌ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించిన.. అజహరుద్దీన్‌ తాను పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే పార్టీ మార్పుపై వార్తలను ఖండించకపోవడం గమనార్హం.  

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా   74 ఓట్ల తేడాతో విజయం సాధించారు.