బీజేపీలో చేరికకు విజయశాంతి మొగ్గు!

ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకురాలు విజయశాంతి తిరిగి బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. దసరా సమయంలో ఈ విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన ఆమె మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్ష పదవి కూడా చేపట్టారు. ఆ పార్టీ తరపున ప్రముఖమైన ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించడం కోసం బిజెపికి దూరమయ్యారు. టీఆర్‌ఎస్‌ లో చేరి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. 

అయితే ఆ తర్వాత ఆ పార్టీలో ప్రాముఖ్యత తగ్గడం, 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీ సహితం తగు ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కోసం క్రియాశీలకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ స్టార్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఎన్నికలలో కాంగ్రెస్ చతికల పడడంతో మౌనంగా ఉంటున్నారు. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ను ఓడించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన ఆమె తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. బిజెపి నేతలు సహితం ఆమెను కలసి పార్టీలో చేరమని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం చేపట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలపై కన్ను వేయడం తెలిసిందే. 

బీజేపీలో చేరితే ఆమెను హుజూర్ నగర్ ఉపఎన్నికలలో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో ఉపయోగించుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.