చంద్రబాబు సభలకు దూరంగా ఎమ్మెల్యే శివాజీ

తెలుగు దేశం పార్టీలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల దిక్కర ధోరణులు ఈ మధ్య పెరుగుతున్నాయి. మొన్ననే తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి శాసనసభ్యురాలు ఏం సుగుణమ్మ  ఆయన పర్యటనకు దూరంగా ఉంది సంచలనం కలిగించారు. దానితో మరుసటి రోజు ప్రత్యేకంగా ఆమెను పిలిపించుకొని తిరుపతిలో ఆమెతో ముఖ్యమంత్రి మాట్లాడవలసి వచ్చింది.

ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా సీనియర్ శాసనసభ్యుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్‌ శివాజీ కుడా ఆయన సభలకు దూరంగా ఉండటం సంచలనం రేపింది. మంత్రులు, ఇతర నేతలు వారించినా అక్కడి వరకు వచ్చి, ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గోనకుండానే వెనుదిరిగారు.

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి రాకముందే శివాజీ వచ్చి ఆసీనులయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ విఠల్‌రావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మెట్ట సుజాతలను వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, ఇచ్ఛాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్‌, ఎమ్మెల్యే శివాజీ కూడా వారిని పంపించాలని సూచించినా పోలీసులు ససేమిరా అన్నారు.

దీంతో ముఖ్యమంత్రి వచ్చేంతవరకు శివాజీ అక్కడే వేచి ఉన్నారు. సీఎం రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు బుజ్జగించినా రాలేదు. ఆయన వెంట శిరీష, విఠల్‌రావు కూడా వెళ్లారు. అయితే వీరిద్దరు వెనక్కి తిరిగివచ్చినా శివాజీ మాత్రం తిరిగి రాలేదు.

ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదికి జలసిరి హారతి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శివాజీని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గౌతు లచ్చన్న కుమారుడిని అడ్డుకుంటారా అని శివాజీ ప్రశ్నించినా వారు అనుమతించలేదు. ముఖ్యమంత్రి వచ్చిన తరవాతే అనుమతిస్తామని తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విషయం ముఖ్యమంత్రికి తెలియడంతో భద్రత సిబ్బందిని ఆయన మందలించారు.