ప్రధాని మోదీ, అజిత్‌ దోవల్ లక్ష్యంగా జైషే స్పెషల్ స్క్వాడ్ 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు లక్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ, జైషే మహ్మద్ ఉగ్రవాదులతో  స్పెషల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు విదేశీ ఇంటలిజెన్స్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రతీకార చర్యలో భాగంగా ప్రధాని, దోవల్ పై సంచలన దాడి చేయాలని పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు వ్యూహం రూపొందించారని భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. 

ఈ దాడి గురించి జైషే మహ్మద్ కు చెందిన కరడుకట్టిన ఉగ్రవాది షంషేర్ వనీ చేతిరాతతో రాసిన ప్రతి ఇంటలిజెన్స్ వర్గాలకు లభించింది.సెప్టెంబరు నెలలో పెద్ద ఉగ్ర దాడికి పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ కుట్ర పన్నిన నేపథ్యంలో పోలీసులు దేశంలోని 30 నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూ, అమృత్‌సర్, పఠాన్‌కోట్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నో నగరాలతోపాటు 30 నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

బాలాకోట్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడిలో కీలక పాత్ర పోషించిన అజిత్ దోవల్ ను పాక్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఆయనకున్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 5వతేదీ తర్వాత భారతదేశంలో పుల్వామా తరహా దాడులకు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఫిదాయిన్ లను పంపించి వ్యూహరచన చేశారని తేలడంతో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.