యడ్యురప్పతో 17 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు !

పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రి రమేశ్‌ జార్కిహొళిని సముదాయించలేక పోతున్న కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం పార్టీకి చెందిన అనేకమంది ఎమ్యెల్యేలు ప్రతిపక్ష నేత, రాష్ట్ర బిజెపి అద్యక్షుడు బి ఎస్ యడ్యురప్ప తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకొని ఖంగు తింటున్నది. `డెక్కన్ క్రానికల్’ కధనం ప్రకారం 17 మంది ఎమ్యెల్యేలు వరకు ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడైనది. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్నవారిని సముదాయించడం కాంగ్రెస్ కు అగ్నిపరిక్షగా మారింది.

కొందరికి మంత్రి పదవులు ఇస్తే, మిగిలిన వారు పార్టీకి దూరం కావచనే భయంతో మంత్రివర్గ విస్తరణను సహితం కాంగ్రెస్ వాయిదా వేస్తూ వస్తున్నది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించియన బిజెపి నేతగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన యడ్యురప్ప కేవలం మరో ఏడుగురి మద్దతును కూడాదీసుకోలేక రాజీనామా చేయవలసి రావడం తెలిసిందే.

ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు కుదదీసుకోగలమనే ధీమా ఆయనలో కనిపిస్తున్నది. దానితో వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికలకన్నా ముందే తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టగలమనే భరోసా ఆయనలో వ్యక్తం అవుతున్నది. ప్రస్తుత పరిస్థితులలో దసరా కన్నా ముందే హెచ్ డి కుమారస్వామి నేతృత్వంలోని జెడి(ఎస్) – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకులే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యడ్యురప్పతో తమ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నాయకులకు తెలుసు. ఆశ్చర్యకరం ఏమిటంటే సంకీర్ణం సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహితం అసంతృప్తిగా ఉన్న పార్టీ ఎమ్యెల్యేలను సముదాయించే ప్రయత్నం చేయడం లేదు. 12 రోజుల ఐరోపా పర్యటన నుండి తిరిగి వచ్చిన ఆయన చాల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ పర్యాయం ప్రభుత్వం ఏర్పాటు పట్ల తొందర పడకూడదని బిజెపి చూస్తున్నది. ఆ విధంగా చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉన్నదని వెనుకడుగు వేస్తున్నది. తనంతట తానే ఈ ప్రభుత్వం కూలిపోయే వరకు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నది. ప్రభుత్వం కూలిపోతే ముందుగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కుడా లేకపోలేదు.