ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకం

పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు బీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణంచేత కాలధర్మం చేసినా, ఎల్ఐసీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు.

అట్టి చెక్కును కుటుంబ సభ్యులకు చేరే విధంగా, యంత్రాంగాన్ని నియమించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. బీమా మొత్తం బాధ్యులకు చేరే క్రమంలో తలెత్తే బాలారిష్టాలు, నియమ నిబంధనల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ కార్యదర్శులదే నని స్పష్టం చేశారు. వీరిరువురు సమన్వయంతో పనిచేయాలని, అర్హులైన వారికి బీమా చెక్కును అందించడంలో వీరిద్దరిదే భాధ్యత అని సీఎం తేల్చి చెప్పారు.

కాలధర్మం చేసిన అర్హుడైన/అర్హురాలైన రైతుకు 48 గంటల కాలపరిమితిలో మరణ ధృవీకరణ పత్రాన్ని అందచేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శిదేనని స్పష్టం చేశారు. రైతుకు బీమా అందే క్రమంలో దశల వారిగా తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. బాధలో ఉన్న రైతు కుటుంబం ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి పదిరోజుల్లోపు భీమా చెక్కు అందే విధంగా అడుగడుగున ఏ విధమైన చర్యలు చేపట్టాలో అటు పంచాయితీ రాజ్ ఇటు వ్యవసాయ అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.

"దాదాపు రూ 636 కోట్తో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకాన్ని మనం ప్రారంభిస్తున్నం. గ్రామస్తాయిలో అర్హులైన రైతుల పేర్లు తదితర వివరాలు వ్యవసాయ విస్తరణాధికారి ట్యాబ్ లో తన వెంట అందుబాట్లో వుండాలె. ఈ నెల పద్నాలుగు తారీఖు అర్థరాత్రి నుంచే ఈ పథకం అమలులోకి రానున్నందున ఆ సమయం తర్వాత ఏ కారణం చేతనైనా అర్హుడైన రైతు మరణిస్తే.. అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలను నిర్ణీత సమయం అంటే పదిరోజుల్లో అందచేయాలె. ఇందుకు సంబంధించిన అమలు కార్యాచరణకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలె" అంటూ ఆదేశించారు.