తక్కువ నష్టం, తక్కువ భూసేకరణతో కృష్ణా-గోదావరి అనుసంధానం 

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు.  వీలైనంత తక్కువ భూసేకరణతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. గోదావరి నీటి తరలింపుతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలు ఇతర అం శాలపై ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్‌లో సుధీర్ఘంగా చర్చించారు. గోదా

వరి నీటిని కృష్ణాకు ఎక్కడి నుంచి ఎలా తరలించాలి? అలైన్‌మెంట్ ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా జలాల తరలింపు, వినియోగం ఉండాలని నిర్ణయించారు. దీని కోసం రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. 

గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి రాయలసీమ, కృష్ణడెల్టాకు తరలించడానికి దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట నిర్మించడమే ఉత్తమమైందిగా ఇంజనీర్ల కమిటీ అందజేసిన నివేదికతో ఇరువురు ఏకీభవించినట్టు తెలిసింది. 

దుమ్ముగూడెం వద్ద 40 టీఎంసీల సామర్ధ్యంతో ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు రోజుకు 2 టీఎంసీలు తరలించాలని కమిటీ సిఫారసు చేసింది. దుమ్ముగూడెంతో పాటు రాంపూర్, తుపాకులగూడెం వద్ద ఆనకట్ట నిర్మించే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ నీటి లభ్యత, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, భూసేకరణ తదితర కారణాలతో దుమ్ముగూడెం ఉత్తమైందిగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.  

 విద్యుత్, పోలీసు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. తెలంగాణలో 18వేల పోలీసులను ఒకేసారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఎపిలో శిక్షణ ఇవ్వాలని కెసిఆర్ ఎపి ముఖ్యమంత్రిని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించా రు. పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరిని ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసలుబాటు కలుగుతుంది.

రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలతో పాటుగా గోదావరి జలాల తరలింపు, ప్రస్తు తం దేశంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై వారిరువురు సమాలోచన లు జరిపినట్లు సమాచారం 

కాగా, త్వరలో జరగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సిఎం కెసిఆర్‌ను, వైఎస్ జగన్ ఆహ్వానించారు. ఈ మేరకు కెసిఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు.