దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి తెచ్చే యోచనలో బిజెపి 

ఇటీవల అసోంలో ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి)ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. 'న్యూస్‌ 18' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జాతీయ భద్రతను మరింత బలపరిచేందుకు అసోంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేశామని, ఈ ప్రక్రియను కేంద్రం ఇతర రాష్ట్రాల్లోనూ చేపడు తుందని తెలిపారు. తద్వారా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న చొరబాటుదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

'ఇటువంటి అక్రమ చొరబాట్ల వల్ల ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశమంతా అంతర్గత భద్రత సమస్యలను ఎదుర్కొం టోంది. గతంలో చొరబాటు దారులు మన దేశంలోని ప్రవేశించి వనరులన్నింటినీ దోచుకున్నారు. వీరిలో ఎక్కువ భాగం బంగ్లాదేశ్‌ నుంచి వస్తున్నారు' అని పేర్కొన్నారు. ఎన్‌సిఆర్‌సిని అమలు చేసేందుకు తమ రాష్ట్రం కూడా సిద్ధంగా ఉందని హర్యానా ప్రభుత్వం ఈనెల 16న స్పష్టంచేసిన విషయం తెలిసిందే. 

కుటుంబ గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు తమ ప్రభుత్వం వేగవంతంగా పనిచేస్తోందని, దీని సమాచారాన్ని ఎన్‌ఆర్‌సిలోనూ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దీనికి మద్దతు ఇచ్చేట్లుగా ఆదిత్యనాధ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అసోంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెలాఖరులో ఎన్‌ఆన్‌సి తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో దాదాపు 19 లక్షల మంది పేర్లు నమోదు కాలేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీని తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సి అమలు చేయాలన్న డిమాండ్‌ను బిజెపి నేతలు ముందుకు తెస్తున్నారు. 

ఢిల్లీలో కూడా ఎన్‌ఆర్‌సి చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్‌ తివారీ ఇదివరకే ప్రతిపాదన చేశారు. తెలంగాణలోనూ బిజెపి నేతలు గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఆర్‌సికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని, దీనికి సంబంధించి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నామని మణిపూర్‌ సిఎం ఎన్‌.బీరేన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. తమతోపాటు ఇందుకు ఇతర ఈశాన్య రాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉన్నాయని అన్నారు.