అశేష జనవాహిని మధ్య కోడెల అంతిమయాత్ర  

నవ్యాంధ్ర ప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్, మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు పల్నాడు కన్నీటి వీడ్కోలు పలికింది. నర్సరావుపేటలోని స్వర్గపురిలో డాక్టర్ కోడెల అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. జిల్లాతో పాటు రాష్టవ్య్రాప్తంగా తరలివచ్చిన కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల నడుమ పల్నాటి పులికి ఘనమైన అంతిమ వీడ్కోలు లభించింది. 

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నర్సరావుపేటలోని కోడెల స్వగృహం కోట నుండి బయలుదేరిన అంతిమ యాత్ర సత్తెనపల్లి రోడ్డు, బరంపేట, పల్నాడు బస్టాండ్, శివుడు బొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా గుంటూరు రోడ్డులోని స్వర్గపురికి సాగింది. యాత్ర పొడవునా ఆయన అభిమానులు, కార్యకర్తలు బరువైన గుండెలతో జోహార్లర్పిస్తూ సాగారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిఎల్‌పి ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని తదితర పార్టీ ముఖ్య నేతలు అంతిమయాత్ర ఆద్యంతం కోడెల పార్థివదేహం వెంట నడిచారు. 

స్వర్గపురి వద్ద కోడెల తనయుడు కోడెల శివరామ్ దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహిస్తామని నిర్ణయించినప్పటికీ కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు అందుకు అంగీకరించలేదు.