బెంగాల్ కు ప్రధాని మోదీని ఆహ్వానించిన మమతా 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బెంగాల్‌కు ఆహ్వానించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రధానితో సమావేశమైన మమతా బెనర్జీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధానిని మర్యాదపూర్వకంగానే తాను కలుసుకున్నానని, తమ సమావేశం ఫలప్రదమైందని చెప్పారు.

బెంగాల్‌లో జరుగనున్న వాణిజ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్)కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించానని, అలాగే బెంగాల్ పేరును 'బంగ్లా'గా మార్చే విషయంపై కూడా ఆయనతో మాట్లాడానని చెప్పారు. దీనిపై తాను చేయగలిగినదంతా చేస్తానని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. 

దీనితోపాటు, ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైన బొగ్గు గని డియోచా పచామి ప్రాజెక్టు కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ప్రధానిని కోరామని చెప్పారు. ప్రాజెక్టు విలువ రూ.12,000 కోట్లని ఆమె చెప్పారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సముఖంగా ఉన్నామని ఆమె తెలిపారు. పలు అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయని, సుహృద్భావ వాతావరణంలో తమ సమావేశం జరిగిందని తెలిపారు. 

ఎన్‌ఆర్‌సీపై మీడియా అడిగినప్పుడు ఆ అంశం తమ సమావేశంలో ప్రస్తావనకు రాలేదని మమత జవాబిచ్చారు. మోదీ మంగళవారం తన 69వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మమత తన తరఫున మోదీకి ప్రత్యేక కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు. మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాల అనంతరం ఈ ఇద్దరు నాయకులు  కలుసుకోవడం గమనార్హం.