ప్రాంతీయ పార్టీల శకం పూర్తి కావస్తోంది  

దేశంలో ప్రాంతీయ పార్టీల శకం పూర్తి కావస్తోందని, జాతీయ సమైక్యతను నిలపగలిగేది జాతీయ పార్టీలేనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో విశాఖలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సహకార లౌకిక వ్యవస్థకు జాతీయత అవసరమని తెలిపారు. అది బీజేపీ వల్లే సాధ్యమని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. 

మరో పది, పదిహేనేళ్ల పాటు దేశంలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గడచిన 72 ఏళ్లలో సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకోలేక పోయామని, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఈసారి జమ్ము-కశ్మీర్ సహా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోగలిగామని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 విషయంలో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ తప్పుచేశారనే వాదన కంటే వివాదస్పదం అవుతున్న అంశాన్ని సవరించలేకపోయారని తెలిపారు. 

వ్యాపార, పారిశ్రామిక వేత్తగా తాను టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ గత అయిదేళ్ల కాలంలో కేంద్ర మంత్రిగా తాను రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఎంతో కృషి చేశానని తెలిపారు. అయితే కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నది వాస్తవమేనని, గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పారు. 

తిరిగి మనమే అధికారంలోకి వస్తామన్న ధీమాతో  టిడిపి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమే నేటి దుస్థితికి కారణంగా పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అభిప్రాయపడ్డారు. సుస్థిర వౌలిక సదుపాయాలు కల్పిస్తే పౌర జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. 

పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పిలుపిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ కే హరిబాబు కూడా పాల్గొన్నారు.