మజ్లిస్ పార్టీ చేతిలో  టీఆర్‌ఎస్ రిమోట్

తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో స్టీరింగ్ ఉన్నా, రిమోట్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వేలాది మంది ప్రజల బలిదానాలతో హైదరాబాద్ సంస్థానం విముక్తి చెందితే విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు టీఆర్‌ఎస్ జంకుతోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటూ హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్టల్రోని మరాఠ్వాడ, కర్నాటకలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినోత్సవాలు జరిపుతోందని గుర్తు చేశారు. సంస్థానం రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో తీవ్ర పోరాటం జరిగితే, ఇక్కడ కేసీఆర్ ఎందుకు విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదని ప్రశ్నించారు. 

 ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా వల్లనే కాశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు సాధ్యమైందని తెలిపారు. జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేందుకు ఆ నాడు సర్దార్ పటేల్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణమైందని కొనియాడారు. కాశ్మీర్ వ్యవహారాలను నడిపిన నెహ్రూ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం బీజేపీ లక్ష్యమని, ఈ దిశగా తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. 

అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, ఈ దిశగా గత ప్రభుత్వాలపై పోరాడారని, కాని అధికారం వచ్చిన వెంటనే మాట తప్పారని దయ్యబట్టారు. మజ్లిస్‌తో ఉన్న పొత్తు, మిత్ర పక్షమైనందు వల్ల వాళ్లు చెప్పినట్లు కేసీఆర్ వింటున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి, రజాకార్ల అరాచకాల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన ఈ రోజును స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించడం క్షమించరాని నేరమని మండిపడ్డాయిరు. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటుండగా తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం పాలనలోనే మగ్గారని గుర్తుచేసారు. 

సుమారు 13 మాసాల పోరాటం తరువాత తెలంగాణకు విముక్తి లభించిందని చెప్పారు. ఇలాంటి రోజును కేసీఆర్ అధికారికంగా జరపకపోవడం ఆయనకు మజ్లిస్ పార్టీలో ఉన్న లోపాయికారీ ఒప్పందమే కారణమని ఆరోపించారు. భారతావనితో మాత్రం కలవమని, పాకిస్తాన్‌తో కలవడానికి సిద్ధమని భీష్మించిన నిజాం మెడలు వంచి దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి ప్రసాదించారని కిషన్‌రెడ్డి గుర్తుచేసారు. హైద్రాబాద్ మహానగరాన్ని బారత సైన్యం చుట్టుముట్టడంతో నిజాం రాజీకి వచ్చేలా చేసిందని చెప్పారు.