ట్రెండ్ సృష్టిస్తున్న మోదీ జన్మదినోత్సవం 

భారత ప్రధాని నరేంద్ర మోదీ 69వ పుట్టినరోజు సామాజిక మాధ్యమాలలో విశేష ఆదరణ ఒపండింది. ప్రపంచంలోనే విశేష ఆదరణ కలిగిన నేత మోదీ కావడంతో ఆయన పుట్టినరోజు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ సృష్టిస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌ బర్త్‌డే మోదీ పేరుతో ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న వరుసలో మూడో స్థానంలో నిలిచింది. 

కొన్ని మిలియన్ల ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు, నెటిజన్స్‌ ఈ జాబితాలో ఉన్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఇప్పటివరకు 11 లక్షల 37 వేల మంది ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. ఇండియాలో టాప్‌-10 ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో మోదీ పుట్టినరోజుకు సంబంధించినవే ఏడు ఉండడం గమనర్హం. సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో మోదీ భారీ బొమ్మ గీసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్న పిల్లలు సైతం పాట రూపంలో ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపడం విశేషం.  

ఇలా ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం మోదీ తల్లి హీరాబెన్ తో కలిసి భోజనం చేశారు. ఆమె కుమారుడికి రూ 501 బహుమతిగా ఇచ్చారు. 

ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నరేంద్రమోదీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ తెలిపారు. నరేంద్రమోదీజీకి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.