నర్మదా నది తీరంలో ప్రధాని మోదీ 69వ జన్మదినోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో నర్మదానది తీరంలో మంగళవారంనాడు 69వ పుట్టినరోజు జరుపుకొన్నారు. కెవడియాలోని సర్దార్ సరోవర్ డ్యామ్‌ను సందర్శించి నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదిలో పూలు వదిలారు. నదీమ తల్లికి హారతి పట్టారు. 

శాస్త్రోక్తంగా పూజలు చేసి, నదిలో పూలు వదిలారు. నదీమ తల్లికి హారతి పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'నమామి దేవి నర్మద మహోత్సవ్‌'లో భాగంగా ఈ పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌ ఎత్తును 138.68 మీటర్లు పెంచిన తర్వాత తొలిసారి పూర్తిగా నీటితో నింపారు.

అంతకుముందు, కవడియాలోని కాక్టస్ గార్డెన్, బట్టర్ ఫ్లై గార్డెను మోదీ సందర్శించారు. సీతాకోక చిలుకలను ఎగురవేస్తూ సందడి చేశారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని సందర్శించి సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు.

గత ఏడాది అక్టోబర్ 31న పటేల్ జయంత్యుత్సవం సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రధాని తన పర్యటన ముగించుకుని సాయంత్రం ఢిల్లీకి బయలుదేరే ముందు తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు అందుకుంటారు.

కాగా, గత రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న మోదీకి సీఎం, గవర్నర్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని రాకను పురస్కరించుకుని కెవడియాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుద్దీపాలు, అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.