తెలంగాణలో కూడా బిజెపి సర్కారు

తెలంగాణాలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. మహబూబ్‌నగర్‌లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధిస్తూ వస్తున్నదని గుర్తు చేసారు.

"తెలంగాణలో టీఆర్ఎస్పై పోరాటం ప్రారంభమైంది. 2019లో ఎన్నికలు రావాల్సి ఉంది. 2019లో ఎన్నికలు రావాల్సి ఉంది. శాసనసభ, లోక్‌సభకు ఒకే సారి ఎన్నికలు జరగాలని మోదీ ప్రతిపాదించారు. జమిలి ఎన్నికలకు కేసీఆర్‌ కూడా ఆమోదించారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు? తొమ్మిది నెలల్లో ఓడిపోతామని కేసీఆర్‌కు భయమా?” అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును నిలదీసారు.

‘ఇంతకాలం జమిలీ ఎన్నికలను సమర్ధించిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు యూ టర్న్‌ తీసకున్నారో ప్రజలకు వివరించాలి. లోక్‌ సభతో కలిసి పోటీ చేస్తే ఓడిపోతామని భయపడ్డారు. అందుకే మే నెలలో కాకుండా నవంబర్‌, డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ కేసీఆర్‌ స్వార్ధపూరిత ఆలోచన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది. తెలంగాణలో కేసీఆర్‌ పాలన చూశాక ఆ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని అనుకోవడం లేదు. మూఢనమ్మకాలతో సచివాలయానికి వెళ్లని వ్యక్తిని మరోసారి గెలిపించి రాష్ట్రంలో రజాకార్ల పాలనను ఆహ్వానిస్తారా అంటూ’ అమిత్‌ షా ప్రజలను ప్రశ్నించారు. 

కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని అమిత్‌షా ఆరోపించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లన్నారు. దళితులకు మూడేకరాల భూమి ఇస్తామన్నారు. కానీ వాటన్నింటిని గాలీకి వదిలి మీరు మాత్రం పదేకరాల్లో ప్రగతి భవన్‌ పేరుతో గడి కట్టుకున్నారని అమిత్‌ షా ఎద్దేవా చేసారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే వారి మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దళితులను వేధించడం, రైతులను అరెస్టు చేయడం వంటి పనులు కేసీఆర్‌కే సాధ్యమవుతాయని తెలిపారు. 2014లో దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ కనీసం ఈ సారి ఎన్నికల్లో అయినా మాటా మీద నిలబడతారా అంటూ ప్రశ్నించారు. ఆఖరికి అమర వీరుల కుటుంబాలను అదుకోవడంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అమిత్‌ షా దయ్యబట్టారు.

మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ విముక్తి ప్రాంతాల్లో సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నారని గుర్తు చేసారు. కానీ తెలంగాణలో కేసీఆర్‌ తన మిత్రుడు అసదుద్దిన్‌ ఓవైసీకి భయపడి విమోచన దినాన్ని జరపడం లేదని విమర్శించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తానందని చెబుతూ మరి ఆ రిజర్వేషన్లను ఎలా ఇస్తుందో? ఎవరి కోటాను కట్‌ చేసి మైనారిటీలకు రిజర్వేషన్‌ పెంచుతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పలు పథకాల అమలు కోసం కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి లక్షా పదిహేను వేల కోట్ల నిధులిచ్చామని, వాటన్నింటిని ఎలా ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది నిరుపేద మహిళలకు గ్యాస్‌ కనెక్షన్‌లు ఇచ్చాం అని తెలిపారు. హైదరాబాద్‌లో 30 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం మోదీ సాకారం వల్లనే పూర్తయ్యిందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్‌ పనిచేస్తోందని ఆయన ప్రకటించారు. అందుకే ఈ సారి ఎన్నికల్లో కూడా కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని అమిత్‌ షా ప్రజలను కోరారు.

రాహుల్ గాంధీ పగలు, రాత్రి తేడా లేకుండా అనేక కలలు కంటూ ఉంటారని ఎద్దేవా చేసారు. 2014 నుంచి 2018 వరకు ఏం జరిగిందో రాహుల్‌ తెలుసుకోవాలని హితవు చెప్పారు. రాహుల్‌ గాందీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందని స్పష్టం చేసారు. రాహుల్‌ ప్రచారం చేసిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అపజయం చవిచూసిందని గుర్తు చేశారు. కానీ మోదీ వచ్చాక మహారాష్ట్ర, హిమాచల్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలో కూడా కాంగ్రెస్‌ను గద్దె దించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.