మాయావతికి ఆరుగురు ఎమ్మెల్యేలు షాక్  

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. రాజస్థాన్‌లో ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు  కాంగ్రెస్‌ పార్టీలో సోమవారం సాయంత్రం చేరారు. దీంతో రాజస్థాన్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే పూర్తి మెజారిటీని సంతరించుకుంది. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకైక పెద్ద పార్టీకి అవతరించింది. అయితే మెజారిటీకి అవసరమైన బలం లేకపోవడంతో బీఎస్‌పీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. తాజాగా, ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న బలం 100 నుంచి 106కు చేరింది.

బీఎస్‌పీ ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ అవనా తాజా పరిణామాలపై మాట్లాడుతూ, తమ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఒకవైపు ప్రభుత్వానికి మద్దతిస్తూ, మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో వారిపైనే పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గాల అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

బీఎస్‌పీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ తాము తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒక లేఖను బీఎస్‌పీ ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషికి లాంఛనంగా అందజేశారు.