పడవ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ

గోదావరి నదిలో టూరిజం బోటు బోల్తాపడిన ఘటనపై సమగ్ర విచారణకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలిపారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే రాష్టవ్రాప్తంగా అన్ని నదుల్లో బోట్ల రవాణా తదితరాలపై మార్గదర్శకాలను సైతం ఈ కమిటీ రూపొందిస్తుందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు.   

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ ఉన్నతస్థాయి కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీపీ, పోర్టు డైరెక్టర్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారని, సంబంధిత జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు. కాగా, దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం హెలీకాప్టర్ ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితులను పరామర్శించారు. రాజమహేంద్రవరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు. 

వసిష్ఠ పున్నమి రాయల్ బోటు ప్రమాదం చాలా దురదృష్టకరమని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బోటు సామర్థ్యం 76 మంది అని, ప్రమాద సమయంలో 73 మంది మాత్రమే ఉన్నారని, ఈ ప్రమాదంలో 27 మంది సురక్షితంగా బయటపడ్డారని బోస్ వివరించారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలు లభించాయని, 38మంది గల్లంతయ్యారని వివరించారు. గల్లంతైన వారికోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టమని చెప్పారు. 

స్పెషల్ వెసల్ రికవరీ టీమ్, స్కానర్లతో కూడా గాలింపు జరుగుతోందన్నారు. స్పెషల్ డీప్ డ్రైవర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామబు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షలు, గాయాలు లేకపోయినప్పటికీ బయటపడిన వారికి రూ.లక్ష వంతున పరిహారానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.

బోటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గత ప్రభుత్వం 16.11.2007లో జీవో 667 జారీచేసింది, దానిప్రకారం బోట్లకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లకు పోర్టు డిపార్టుమెంట్‌ను పరిమితం చేశారని, జలవనరుల శాఖకు ఏ విధమైన బాధ్యత లేకుండా చేశారన్నారు. బోట్ల రాకపోకలపై ఎవరికీ బాధ్యత లేకుండా చేసినందునే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వరదల నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టూరిజం బోట్లన్నీ నిలుపుచేశారని,ప్రైవేటు యాజమాన్యంలో వున్న బోట్లను మాత్రం నిలుపుచేయలేదన్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఉన్నతస్థాయి కమిటీ కూలంకషంగా చర్చించి, మార్గదర్శకాలను రూపొందిస్తుందని తెలిపారు. ఇకపై ప్రతీ నెలా పర్యాటక బోట్లకు ఫిట్‌నెస్ ధ్రువీకరణపత్రం తీసుకోవాలని, నిరంతరం తనిఖీలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 

సాధారణంగా ఇటువంటి సంఘటనలు జరిగినపుడే పట్టించుకుంటారని, కానీ ఇకపై అలా కాకుండా ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత బాధ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారని ఉప ముఖ్యమంత్రి బోస్ చెప్పారు. నదిలో దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తున్నపుడు బోటును ఎలా అనుమతించారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారని, అయితే జీవో ఇచ్చారు తప్ప బాధ్యతలెవరికీ నిర్ధేశించలేదని తెలుస్తోందన్నారు. ఇకపై చాలా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారన్నారు.