ఇంత చేతకాని ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు 

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత చేతకాని ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. వంద రోజుల పాలనలోనే అన్ని వ్యవస్థలపై పట్టు కోల్పోయిన ఇటువంటి ముఖ్యమంత్రి చేతిలో మరో నాలుగేళ్లలో ఈ రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

బీజేపీ ఆధ్వర్యంలో గురజాల ఆర్డీవో కార్యాలయం సమీపంలో సోమవారం చేపట్టిన ‘ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ’ కార్యక్రమా న్ని పోలీసులు అడ్డుకొని భగ్నం చేశారు. సభకు బయల్దేరిన కన్నాను సత్తెనపల్లి నందిగామ అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని సత్తెనపల్లిలోని ఎన్‌ఎ్‌సపీ గెస్ట్‌ హౌస్‌లో ఉంచారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నెల రోజుల క్రితం పల్నాడులో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేస్తే అరికడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ బహిరంగ సభ చేపట్టిందని తెలిపారు. 

దేవాలయాల సంరక్షణ, ధూపదీప నైవేద్యాల కోసం దాతలు ఇచ్చిన దేవాలయ భూములను ఎవడబ్బ సొత్తు అని పంచుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన హిందూ వ్యతిరేకంగా ఉందని ముద్రపడిందని మండిపడ్డాయిరు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శన, బహిరంగ సభలను జరుపుకోలేని పరిస్థితిలో రాష్ట్రంలో ఉందని దయ్యబట్టారు. 

గత ప్రభుత్వంలో ఇదేవిధంగా వ్యవహరిస్తే జగన్‌ పాదయాత్ర ప్రారంభించేవారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన మీడియా చానళ్లు ఏబీఎన్‌, టీవీ 5లు లోపాలు ఎత్తి చూపుతున్నాయని నిషేధించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.