కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్యే  

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. కోడెల శివప్రసాద్ పోస్టుమార్టం ప్రాథమిక సమాచారం పోలీసులకు అందింది. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. 

శివప్రసాద్ మెడ భాగంలో తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో ఉందని తెలిపారు. అయితే మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు ఆనవాళ్లు గుర్తించారు. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా వైద్యులు ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 గత మూడు నెలల నుంచి కోడెల శివప్రసాదరావుకు వేధింపులు ఎక్కవయ్యాయని, వాటిని భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉంచారు. కోడెలకు నివాళులర్పించేందుకు భారీగా తరలివస్తున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంగళవారం ఉదయం కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని గుంటూరు జిల్లాకు తరలించనున్నారు.  

కోడెల శివప్రసాదరావు మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఎసిపి ఆధ్వర్యంలో మూడు టీమ్ లు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కోడెల మృతి చెందిన ఇంటి వద్ద క్లూస్ టీం, టెక్నికల్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందని వివరించారు.