మళ్ళి బీజేపీలో చేరిన విద్యాసాగర్ రావు 

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మళ్ళీ బీజేపీలో చేరారు. గవర్నర్ పదవి చేపట్టే ముందు పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఈ మధ్యనే ఆ పదవీకాలం పూర్తి కావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.  కే. లక్ష్మణ్‌ సమక్షంలో బిజెపి సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా మారుతుందని.. టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుందని ఈ సందర్భంగా లక్ష్యం విశ్వాసం వ్యక్తం చేశారు. 

పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే ఎదిగాను. బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉంది. మహారాష్ట్రకు గవర్నర్‌గా వెళ్లే ముందు పార్టీకి రాజీనామా చేసిన సందర్భం ఆయనకు అత్యంత బాధ కలిగించింది' అని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంపై బలహీనమైన ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటి నుంచి బీజేపికి పూర్తిగా అంకితమవుతానని చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని భరోసా వ్యక్తం చేశారు.

గోదావరి జలాల వినియోగంలో విద్యాసాగర్ రావు పాత్ర కీలకమని ఈ సందర్భంగా లక్ష్మణ్  గుర్తు చేశారు. తన సలహాలు, అనుభవాలు పార్టీకి అవసరమని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.