గురజాల సభకు వెడుతున్న కన్నా అరెస్ట్‌

గుంటూరు లో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం గురజాల లో బిజెపి తలపెట్టిన బహిరంగ సభకు వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా సతైనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సతైనపల్లి డియస్పీ ఆఫీసుకు తరలించారు. పెద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. 

అంతకు ముందు గురజాలలో 144వ సెక్షన్ అమలు, శాంతిభద్రతలు, రాజకీయ పరిణామాల దృష్ట్యా సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. సభను వాయిదా వేసుకోమని ఇచ్చిన నోటీసును స్వీకరించడానికి కన్నా తిరస్కరించారు. దానితో ఆ నోటీసు ను ఆయన ఇంటికి అతికించి వెళ్లిపోయారు. బహిరంగసభను వాయిదావేసి ప్రసక్తి లేదని స్పష్టం చేసారు. 

ఈ నేపథ్యంలో.. పోలీసులతో గొంతు నొక్కుతారా.. అంటూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా.. పల్నాడులో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించేందుకు వెళ్తుంటే... పోలీసులతో గొంతు నొక్కుతారా.. అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని వెనక్కి పరిగెత్తిస్తోందని ఆగ్రహాన్ని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలు ఎజెండాగా పని చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.