తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా బిజెపి

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం ఒక రోజు పర్యటనకు వచ్చిన ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ టి ఆర్ ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదని, తమ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని స్పష్టం చేసారు.

తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్ధతు పెరిగిందని, మరో వంక కేసీఆర్‌కు జనం మద్ధతు లేదని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణకు రూ.2.3 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు. ట్రైబల్‌, వెటర్నరీ, జయశంకర్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేశాంమని, ఎయిమ్స్‌కు రూ.1200 కోట్లు ఇచ్చామని చెబుతూ కాంగ్రెస్‌ సర్కార్‌ కన్నా 20 రెట్లు అధికంగా తెలంగాణకు ఇచ్చాని తెలిపారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ లేకపోయినా ఫెడరల్‌ స్ఫూర్తికి గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ  తెలంగాణ అభివృద్ధి కోసం గ్రామగ్రామానికి వెళ్లేందుకు బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అమిత్‌షా తెలిపారు. బిజెపిని సమర్థించి, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.

ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు మోదీ ఇచ్చిన పిలుపును సమర్ధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు లోక్ సభ కన్నా ముందుగా అసెంబ్లీని తొమ్మిది నెలల ముందే రద్దు చేసి, ఎన్నికలకు ఎందుకు వెడుతున్నారని అమిత్ షా విస్మయం వ్యక్తం చేసారు. లోక్ సభ, అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరపడం వల్లన ప్రజాధనం వృద్దఅవుతుంది కదా అని ప్రశ్నించారు.

ఓటు బ్యాంకు‌ రాజకీయాల కోసం, తన కుటుంభ పాలనను సుస్థిరం చేసుకోవడం కోసం కోసమే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అమిత్‌షా విమర్శించారు. టి ఆర్ ఎస్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. రెండున్నర లక్షల మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్నారు..ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేరిన ఒక్క జిల్లా ఉంటే చూపగలరా? అని నిలదీశారు.

ఖమ్మంలో మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో ఎస్సీలపై జరిగిన దాడులను ప్రజలు మరిచిపోలేదని గుర్తుచేశారు. 14వ ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.

దళిత్ ను ముఖ్యమంత్రిగా చేస్తామన్న కెసిఆర్ మాట తప్పారని విమర్శిస్తూ ఇప్పటికైనా ఆ హామీని నిలబెట్టు కొంటారా అని సవాల్ చేసారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రతి రంగంలో ఘోరంగా విఫలమైనదని విమర్శించారు. శాంతి బాధ్రతలలో, అభివృద్దిలో ఘోరంగా విఫలమైన్నట్లు తెలిపారు. పైగా వోట్ బ్యాంకు రాజకీయాలకు కెసిఆర్ పాల్పడుతున్నారని దయ్యబట్టారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తమనడం వోట్ బ్యాంకు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. మత పరంగా రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదని తెలియదా అని నిలదీశారు. `ఆధునిక రజాకర్ల’ పార్టీ అయిన ఏంఐఏం తో కెసిఆర్ కుమ్మక్కయారని ఆరోపిస్తూ వారిద్దరూ ఎన్నికలలో పోటీ పడటం విచిత్రంగా ఉంటుందని ఎద్దేవా చేసారు.

తెలంగాణను మళ్లీ రజాకార్ల పాలనలో పెడతారా అని ప్రజలు ఆలోచించాలని అమిత్ షా కోరారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు చేయడం లేదని అడుగుతూ మజ్లిస్‌కు భయపడే నిర్వహించడం లేదని దయ్యబట్టారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేంద్రానికి పంపారని అంటూ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని కెసిఆర్ కు తెలిసినా బిల్లు పంపారని ద్వజమెత్తారు. . కేసీఆర్‌ వస్తే మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని  అమిత్‌ షా హెచ్చరించారు.

బాబ్లీ అంశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కోర్టు నోటీసుల వెనక బిజెపి హస్తం ఉందనేది అబద్ధమని అమిత్‌షా స్పష్టం చేసారు. ఆ కేసు నమోదైన సమయంలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు బిజెపిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బిజెపి అద్యక్షుడు అంతకు ముందు ఒకరోజు పర్యటనకు హైదరాబాద్ కు చేరుకున్నప్పుడు బేగంపెట్ విమానాశ్రయంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర అద్యక్షులు డా. కే లక్ష్మణ్, ఇతర నాయకులు  స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్‌షా దోమలగూడ బీమా మైదాన్‌లో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.