మద్యపాన నిషేధం అమల్లో జగన్ వెనుకంజ! 

దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో వెనుకడుగు వేస్తున్నారా? మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరా? అని అనుమానాలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు మాసాలలో గత ప్రభుత్వంకు మించి ఆదాయం పొందటం ఇటువంటి అనుమానాలకు ఆసాకారం కలిగిస్తున్నది. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి నాలుగు మాసాల్లో మద్యం ద్వారా లభించిన ఆదాయం రూ. 6485 కోట్లు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి రూ. 7,137 కోట్లు ఆదాయం వచ్చింది, అంటే 10.5 శాతం ఆదాయం వృద్ధి ఉంది. దశాబ్దాలుగా ఉన్న బెల్ట్‌షాప్‌లన్నింటినీ ఎత్తివేసినప్పటికీ ఆదాయం పెరిగిందే కానీ తగ్గలేదు.

పలు కీలక రంగాలలో ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతుండగా, మద్యం అమ్మకాలలో మాత్రం పెరుగుతూ ఉండటం గమనార్హం. ప్రభుత్వం మాత్రం మద్యం విక్రయాలు 10.50 శాతం తగ్గినట్లు లెక్కలు చూపుతోంది. కాని బీరు అమ్మకాలు 16.03 శాతం పెరిగిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతుందో అంతుబట్టటం లేదు. 2018 జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 66,09,290 కేసులు బీరు విక్రయం జరిగితే ఈ ఏడాది అదే కాల వ్యవధిలో 72,15,850 కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి చెప్పిన విధంగా బీరును హెల్త్ డ్రింక్‌గా ఈ ప్రభుత్వం భావిస్తున్నదేమో అర్థం కావడం లేదు. గంజాయి విక్రయాలు మరో ఆందోళనకర అంశం. విశాఖ మన్యం కేంద్రంగా సాగుతున్న గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ప్రస్తుత ప్రభుత్వం నేటికీ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా లేదు. విజయవాడ రైల్వే జంక్షన్ అడ్డాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. డ్రోన్‌ల ద్వారా కనిపెడతాం అని చెప్పడమేగాని కార్యరూపం దాల్చలేదు. 

ఇక ఇతరత్రా ఆదాయ మార్గాలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్టర్ అవుతున్న డాక్యుమెంట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే మైనస్ 3.2 శాతంగా నమోదైంది. వౌలిక సదుపాయాల రంగాన్ని కుదేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం మూలంగానే దీనితో ముడిపడ్డ అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. దీని వల్ల ఉపాధి అవకాశాలకు గండిపడుతున్నది. 

ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం బెడ్‌లు పెరగక ఒకే మంచంపై ఇద్దరు, అదీకాకుంటే కటిక నేలపై రోగులు పడుకోవాల్సి వస్తున్నది. రేషన్‌కార్డులకు సంబంధించి ఈకేవైసీ నమోదు వ్యవహారం పేదలను కలవర పరుస్తున్నది. చౌకగా ఆహారం అందించే అన్నక్యాంటీన్లు మూతపడ్డాయి. పారదర్శకత ఎలా ఉన్నా దాదాపు 60కి పైగా జీవోలను గోప్యంగా ఉంచారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటించిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మున్ముందు ఏ విధంగా దూసుకెళతాయో వేచి చూడాల్సిందే.