చీపురు పట్టి స్వచ్ఛతే సేవ ప్రారంభించిన ప్రధాని

గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవా’ ఉద్యమాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

దేశంలోని ప్రతిభాగం, సమాజంలోని అన్ని వర్గాలు పరిశుభ్రతలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ స్వచ్ఛతే సేవ ఉద్యమం గాంధీ జయంతి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో పరిశుభ్రత శాతం 40 నుండి 90 శాతానికి పెరిగిందని, గ్రామాల్లో మరుగుదొడ్డు నిర్మించడం ద్వారా బహిరంగ మూత్రవిసర్జనను నిర్మూలించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం అపూర్వమని పేర్కొన్నారు.

సానుకూల భారత్‌ కోసం యువత ముందు వరుసలో నిలిచిందని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులతో మోడీ యాప్‌ ద్వారా మాట్లాడారు.

అనంతరం ప్రధాని మోదీ స్వయంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీ పహర్‌గంజ్‌ ప్రాంతంలోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ శ్రమదానం చేశారు. చీపురు చేతబట్టి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వచ్ఛభారత్‌ కోసం విద్యార్థులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

అంతకుముందు ప్రధాని కార్యాలయం నుంచి పాఠశాలకు బయల్దేరిన ప్రధాని మోదీ ఎలాంటి సెక్యూరిటీ రూట్‌ లేకుండా సాధారణ మార్గంలో ప్రయాణించారు. దీంతో మోదీ కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. కాసేపటికే ట్రాఫిక్‌ క్లియర్ అయిన తర్వాత మోదీ పాఠశాలకు చేరుకున్నారు.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బిజెపి నేతలు, ప్రజాప్రతినిధులు ఈ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్లీలోని వసంత్‌ విహార్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చీపురుపట్టి వీధులు శుభ్రం చేశారు.

హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న బిజెపి అద్యక్షుడు అమిత్‌షా నేరుగా దోమలగూడ చేరుకొని బీమా మైదాన్‌లో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.