వైసిపి కి ప్రధాన ప్రతిపక్షం బిజెపినే

రాష్ట్రంలో వైసిపి కి ప్రధాన ప్రతిపక్షం బిజెపినే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్రొద్దుటూరు లోని రాయలసీమ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా కన్నా మాట్లాడుతూ జిల్లాలో బిజెపిని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని, రాయలసీమ అభివఅద్ధిపై నాయకులతో చర్చించనున్నామని తెలిపారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. గత అయిదేళ్లలో టిడిపి ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని, అందుకే అది కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు.

ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే.. తమ వంతు సహకారం అందించడానికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా, రాష్ట్రంలో వైసిపికి ప్రధాన ప్రతిపక్షం బిజెపి నే నని పేర్కొన్నారు. 

ఇలా ఉండగా, రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని కన్నా డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమ ప్రాజెక్టులకు 210 టీఎంసీల నికర జలాలు కేటాయించాలన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను లక్ష క్యూసెక్కులకు పెంచాలని సూచించారు. 

గుండ్రేవుల, ఆర్డీఎస్‌ సమాంతర కాలువ, వేదావతిపై జలాశయం, జోలదరాశి, రాజోలి జలాశయాలను నిర్మించాలని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి, రూ 20,000 నిధులు కేటాయించాలని, రాయలసీమను ఎనిమిది జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని కూడా డిమాండ్ చేశారు.