డిల్లీలోని ఎయిమ్స్‌ కు మనోహర్ పారికర్‌

అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి  మనోహర్ పారికర్‌ మెరుగైన వైద్యం కోసం నేడు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకు వెడుతున్నారు. ఈ ఉదయం పారికర్‌ ప్రత్యేక విమానంలో దిల్లీ కి బయలుదేరినట్లు గోవా సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా పారికర్ క్లోమ సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయన గతంలో మూడు నెలల పాటు అమెరికాలో కూడా చికిత్స తీసుకుని వచ్చారు. మళ్లీ పారికర్ అస్వస్థతకు గురి కావడంతో  ఆయనను గురువారం సాయంత్రం గోవాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు వెల్లడించాయి.

కాగా, పారికర్‌ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వెంటనే గోవాలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు సీఎం బాధ్యతల నుంచి పారికర్‌ కూడా తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా లతో ఆయన చర్చించినట్లు చెబుతున్నారు. 

పారికర్ అనారోగ్యం కారణంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోవడంతో, స్వస్థత చేకూరేవరకూ ఆయన స్థానంలో తాత్కాలిక సీఎంను నియమించేందుకు బీజేపీ కసరత్తు చేపట్టింది. ఇందుకోసం  విజయ్ పురాణిక్, నిర్వాహక సెక్రటరీ బీఎల్ సంతోష్‌లను సోమవారమే గోవా పంపారు.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగలేనని పారికర్ మోదీ, అమిత్‌షాలను చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం కాస్త కష్టమని, అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సీఎంగా కొనసాగాలని పారికర్‌కు అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది.