సెప్టెంబర్ 17పై కేసీఆర్ ఎందుకు వెనుకకు తగ్గారు!

తెలంగాణ విమోచనం చెందిన రోజైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని గతంలో చెప్పిన కేసీఆర్ ఇపుడు ఎందుకు వెనక్కి తగ్గారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్  ప్రశ్నించారు. సీఎం పదవి అధిష్టించిన వెంటనే.. నిజాం సమాధి వద్ద కేసీఆర్ మోకరిల్లిన రోజే.. ప్రజలు ఆయన్ను అసహ్యించుకున్నారని దయ్యబట్టారు.  టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ల పంచాయతీ పక్కన పెట్టి … తెలంగాణ పండుగ 17 సెప్టెంబర్ పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

సెప్టెంబర్ 17ను తెలంగాణ పండుగగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మొదటి నుండి ఉద్యమం చేస్తోందని స్పష్టం చేశారు. బిజేపీ టీడీపీ, కాంగ్రెస్  ఆధ్వర్యంలో.. ఆనాడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరవేస్తామని చెప్పారు. 

 టీఆర్ ఎస్ పార్టీ ద్వంద్వ విధానాలను ప్రజలు అసహ్యించుకున్నారనీ.. వరంగల్ లో టీఆర్ఎస్ రజాకార్ల పాలన కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. సాయిబాబా దేవాలయంలో పూజారి హత్య.. వినాయక మండపాల్లోకి వెళ్లి దాడులు చేసిన వారితో టీఆర్ ఎస్ అంటకాగడం.. .. రజాకార్ల పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. 

  తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎంఐఎం… ఒత్తిడికి తలొగ్గి 17 సెప్టెంబర్ ను జరపకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, వీరుల చరిత్రను కనుమరుగు చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నారని విమర్శించారు.