‘ఆయుష్మాన్ భారత్’కు బ్రిటన్ జర్నల్ ప్రశంశలు

‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్‌కు  చెందిన ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’ ప్రశంసించింది. ప్రజలందరి ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న తొలి భారతదేశ ప్రధాని మోదీయేనని పేర్కొంది. అయితే ఈ పథకాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా ‘మోడీకేర్’కు సరితూగవలసి ఉందని హితవు చెప్పింది.

‘ద లాన్సెట్’ మెడికల్ జర్నల్ ఎడిటర్ - ఇన్ - చీఫ్ రిచర్డ్ హార్టన్ రాసిన వ్యాసంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చారని ప్రశంసించారు. ఆరోగ్యాన్ని ప్రజల సహజ హక్కుగా గుర్తించారని తెలిపారు. అంతేకాకుండా దీనిని భారతదేశంలోని మధ్య తరగతి వర్గాల పెరుగుతున్న ఆకాంక్షలకు తగినట్లుగా రాజకీయ అస్త్రంగా చేసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో మధ్య తరగతి ప్రజలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పట్ల ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని పునరుజ్జీవింపజేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆ పార్టీ ఎటువంటి వాగ్దానం చేయబోతోందో చూడవలసి ఉందని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, గిరిజనులు, గ్రామీణులు వంటివారికి సహాయపడతామని వాగ్దానాలు ఇస్తున్నప్పటికీ ‘మోడీకేర్’కు సాటి అయినదని చెప్పగలిగే పథకాన్ని ప్రకటించవలసి ఉందని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశం ఆరోగ్య సంరక్షణ కాగలదని అభిప్రాయం వ్యక్తం చేసారు.