కిసాన్‌ మన్‌ధన్‌ యోజన ప్రారంభించిన ప్రధాని మోదీ 

రైతులకు పెన్షన్‌ అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజనను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ  రాంచీలో ప్రారంభించారు. ఈ పధకం జార్ఖండ్‌ను భారత్‌తో పాటు ప్రపంచానికి అనుసంధానం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

ఈ పధకం కింద ప్రస్తుతం 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన సన్న, చిన్నకారు రైతులు వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు రూ 3000 పెన్షన్‌ అందుకుంటారు. రానున్న మూడేళ్లకు రూ 10,774 కోట్లను ప్రధానమంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజన పధకానికి కేటాయించారు. 

స్వ‌యం ఉపాధి వారి కోసం జాతీయ పెన్ష‌న్ స్కీమ్‌ను ప్రారంభించారు. వార్షిక ఆదాయం 1.5 కోట్లు త‌క్కువ‌గా ఉన్న‌వారికి ఇది వ‌ర్తిస్తుంది. జాతీయ పెన్ష‌న్ స్కీమ్ వ‌ల్ల సుమారు 3.50 ల‌క్ష‌ల స‌ర్వీస్ సెంట‌ర్ల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని మోదీ తెలిపారు.

కాగా రాంచీలో మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ సచివాలయ భవనానికి శంకుస్ధాపన చేశారు. దేశ పేద ప్ర‌జ‌ల సంక్షేమ ప‌థ‌కాల కోసం జార్ఖండ్ లాంచింగ్ ప్యాడ్‌గా మారింద‌ని చెప్పారు. 

గ‌త 100 రోజుల ప్ర‌భుత్వంలో కేవ‌లం ట్రైల‌ర్‌ను మాత్ర‌మే చూశార‌ని, ఇంకా సినిమా మొత్తం ముందు ఉంద‌ని మోదీ పేర్కొన్నారు. పేద ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్న‌వారిని స‌రైన చోటుకు పంపేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అంటూ పరోక్షంగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్ ను ప్రస్తావించారు. ఇప్ప‌టికే కొంద‌రు అక్క‌డికి వెళ్లార‌ని చెబుతూ  దేశం క‌న్నా గొప్ప‌వాళ్ల‌మ‌ని అనుకున్న‌వారు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. 

గ‌తంలో ఎన్న‌డూ చూడ‌న‌టువంటి వేగంతో దేశం ముందుకు వెళ్తోంద‌ని ప్రధాని చెప్పారు. అంత‌కుముందు ఆయ‌న షాహిబ్‌గంజ్‌లో నిర్మించిన మ‌ల్టీమోడ‌ల్ వాట‌ర్‌వేస్‌ను దేశానికి అంకితం చేశారు. కొత్త నిర్మించిన రాష్ట్ర అసెంబ్లీని ప్రారంభించారు. కొత్త సెక్ర‌టేరియేట్ బిల్డింగ్ కోసం ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.