బీజేపీ అభ్యర్థిగా రెజ్లర్ బబితా ఫోగాట్?  

ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగాట్ త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె పోలీసు ఇన్‌స్పెక్టరు ఉద్యోగానికి చేసిన రాజీనామాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. బబితా ఈ ఏడాది ఆగస్టు 13వతేదీన బీజేపీలో చేరారు.

ఉద్యోగ రాజీనామా ఆమోదం పొందకుండానే బీజేపీలో చేరడంతో చట్టం ప్రకారం ఆమె వద్ద నుంచి రెండు నెలల జీతాన్ని వసూలు చేయాలని హర్యానా  సర్కారు నిర్ణయించింది. బబితా ఆగస్టు 13వతేదీన పోలీసుఇన్‌స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఈ నెల పదో తేదీన సర్కారు ఆమె రాజీనామాను ఆమోదించింది. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థినిగా వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బబితా పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారని తెలుస్తున్నది. హర్యానా రాష్ట్రంలోని బర్దా లేదా చారఖీ దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ పక్షాన బరిలోకి దిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

బబితాతోపాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగాట్ కూడా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బీజేపీలో చేరారు. నరేంద్రమోదీ విధానాలు నచ్చడంతో తాను బీజేపీలో చేరినట్లు బబితా ప్రకటించారు.