ఆవు, ఓం అనే పదాలు వింటే కొంతమందికి వణుకు  

ఆవు, ఓం అనే పదాలు వింటే కొంతమంది దిగ్భ్రాంతికి గురవుతున్నారని, ఇది నిజంగా దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశం 16 లేదా 17వ శతాబ్దానికి వెళ్లిపోయినట్లుగా వారు భావిస్తున్నారని, పశుసంపద లేకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఊహించగలమా అని ఆయన ప్రశ్నించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ "ఆఫ్రికాలో రువాండా అనే దేశం ఉంది. నేను ఆ దేశానికి వెళ్లా. అక్కడి ప్రభుత్వం గ్రామస్థులకు ఆవులను అందజేసే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. ఆవుకు పుట్టిన తొలి ఆడ దూడను వెనక్కి తీసుకుని, వాటిని ఆవులు లేని వారికి అందజేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు పునాదిని ఏర్పరుస్తున్నది. ఒక ఆవు ద్వారా జీవనాధారాన్ని ఏర్పరరిచే వ్యవస్థను అక్కడ నేను స్వయంగా చూశా" అని ప్రధాని పేర్కొన్నారు. 

అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో కొంతమంది ఆవు, ఓం పేరు వింటే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశం 16వ శతాబ్దానికి వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారని విమర్శించారు.

కాగా, ఒక్కసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వినియోగానికి స్వస్తి పలుకాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పశువుల్లో వ్యాపించే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, బ్రుసెల్లోసిస్ వ్యాధుల నివారణకు జాతీయ పశువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. 

కాగా, ఉగ్రవాదం అనేది ప్రస్తుతం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిందని ప్రధాని మోదీ చెప్పారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి బలమైన మూలాలు ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు శతాబ్దం కిందట, సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద చికాగోలో చారిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చారు. దీని ద్వారా మన దేశానికి చెందిన గొప్ప సంస్కృతి గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే, దురదృష్టవశాత్తు.. ఇదే సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని వణికించింది అని పేర్కొన్నారు.