తెలంగాణ ఎన్నికల రేస్ లో ముందంజలో కెసిఆర్ !

తెలంగాణ అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు ఎన్నికల రేసులో ఎవరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్‌ ఇండియా టుడే, యాక్సిస్‌ మై ఇండియాతో కలిసి చేసిన సర్వేలో తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు.

కేసీఆర్‌ తర్వాతి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉండగా, ఆయన తదుపరి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు కేవలం 18 శాతం మందే చెప్పారు. బిజెపి నేత జి కిషన్ రెడ్డి సిఎం కావాలని 15 శాతం మంది కోరుకొంటుండగా,  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని 4 శాతం మంది మాత్రమె కోరుకొంటున్నారు.

 పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ పేరుతో తెలంగాణలో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరిగింది. మొత్తంగా 7,110 మంది సర్వేలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు వెల్లడించారు. కేసీఆర్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు 11% మంది చెప్పారు.

మరోవైపు వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో 51% ఓటర్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 80 సీట్లు లభిస్తాయని వీడీపీ అసోసియేట్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌కు 20, ఎంఐఎంకు 8, బీజేపీకి 7, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని ఈ సర్వే తేల్చింది.

ఓటింగ్ శాతాల పరంగా చూస్తే.. టీఆర్‌ఎస్‌కు 41శాతం ఓటింగ్ లభిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 27%, బీజేపీకి 10%, ఎంఐఎంకు 6%, టీడీపీకి 4%, సీపీఐకి 2%, టీజేఎస్‌కు 2%, వైసీపీకి 1%, సీపీఎంకు 1%, ఇతరులకు 3% శాతం ఓట్లు పోలవుతాయని సర్వే అంచనా వేసింది. ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోనివారు మరో మూడుశాతం ఉన్నారని తెలిపింది.

సర్వేకోసం తెలంగాణను గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణగా విభజించిన వీడీపీ అసోసియేట్స్.. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు 42%, ఉత్తర తెలంగాణలో 41%, దక్షిణ తెలంగాణలో 39% ఓట్లు లభిస్తాయని అంచనావేసింది.