జగన్‌కు పాలనపై దృష్టి లేదు.. దాడులపైనే   

జగన్‌ సర్కార్‌కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులతో గవర్నర్ విశ్వభూషన్ హరించందన్‌ను సుజనాచౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై ఫిర్యాదు చేశారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని వారు ధ్వజమెత్తారు. పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం, అమరావతిపై గందరగోళం నెలకొందని పేర్కొంటూ రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మంత్రి బొత్స రాజధానిపై స్టేట్‌మెంట్ ఇచ్చి నెలరోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. 

పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని చెప్పారు. ఇక టీడీపీ హయాంలో కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందని విమర్శించారు. కేంద్రం హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలస్యం చేయడం వల్ల ప్రతీ సీజన్‌లో రూ 10వేల కోట్లు నష్టం వస్తుందని వివరించారు. 

టెండర్లు మార్చడం వల్ల 5 రూపాయలు కూడా ఆదా చేయలేరని స్పష్టం చేశారు. గోదావరి వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. 

కాగా, ముడేళ్ళల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఈ విషయమై తనకు సమాచారం లేదని సుజనా చౌదరి స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయి మాజీ సీఎం చంద్రబాబుకు లేదని అంటూ  ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తు చేశారు. 

విశేష కథనాలు