హిమాచల్ గవర్నర్‌గా  దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి ప్రమాణం చేయించారు. 

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. 

రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా క్యాప్‌ను ధరించి దత్తాత్రేయ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు.