పాక్ ఆక్రమిత కశ్మీర్ తదుపరి లక్ష్యం  

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను తిరిగి వెనక్కి తెచ్చుకోవడం, భారత్‌లో భాగం చేయడమే కేంద్ర ప్రభుత్వ తదుపరి లక్ష్యమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ) సమావేశంలో పాక్-భారత్ మంగళవారంనాడు హోరాహోరీగా తలబడిన కొద్ది గంటలకే కేంద్ర మంత్రి తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

'పీఓకేను తిరిగి సాధించుకుని భారత్‌లో భాగం చేయడమే భారత్ తదుపరి లక్ష్యం. ఇది వ్యక్తిగతమైనదో, పార్టీ కమిట్‌మెంటో కాదు. 1994లో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో భాగం' అని జితేంద్ర సింగ్ తెలిపారు. కశ్మీర్‌ను మూసివేయడమో, కర్ఫ్యూ నీడలో ఉంచడమో చేయలేదని, పరిస్థితి గణనీయంగా యథాపూర్వ పరిస్థితికి వస్తోందని ఆయన చెప్పారు. 

కేంద్రం ఇటీవల పలు చారిత్మక నిర్ణయాలు తీసుకుందని, 370 అధికరణ రద్దు ప్రధాని మోదీ నేతృత్వంలో తొలి 100 రోజుల్లో సాధించిన అతి పెద్ద విజయమని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పరిశ్రమల వృద్ధి, ఉద్యోగాలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి వివక్షకు తావులేకుండా గణనీయమైన వృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. 

ఉగ్రవాద ఆందోళనలపై మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌ గడ్డపై పాక్ నిరంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. పాక్ నేతలు చేస్తున్న ప్రకటనలను కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని, పొరుగుదేశం నేతల వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ఆయన కొట్టిపారేశారు.