టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ అరెస్ట్ 

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తనపై ఉన్న కేసుల కారణంగా చింతమనేని గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

ఆయనను ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు చింతమనేని ఇంటి వద్ద భారీ స్థాయిలో మోహరించారు. అరెస్ట్ సందర్భంగా అనేకమంది మద్దతు దారులు పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. 

చింతమనేని ఇంటి దగ్గర నేటి ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నేటి ఉదయం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ అనుచరులు నిలదీశారు. 

దళితులను కులం పేరుతో దూషించారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి బాధితులు  విచారణ జరిపి  చర్య తీసుకొంటామని జిల్లా పోలీసులు ప్రకటించారు.