చంద్రబాబు, లోకేష్ గృహ నిర్బంధం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌ల‌ను అమ‌రావ‌తిలో గృహ‌నిర్బంధం చేశారు. అధికార పార్టీకి చెందిన నేత‌ల త‌మ‌పై దాడుల‌కు దిగుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో బుధవారం  తెలుగుదేశం పార్టీ నిర‌స‌నకు పిలుపునిచ్చింది. న‌ర్సారావుపేట‌, స‌త్త‌న‌ప‌ల్లి, ప‌ల్నాడు, గుజ‌రాలాలో 144వ సెక్ష‌న్ విధించారు. 

రాష్ట్ర‌వ్యాప్తంగా 12 గంట‌ల పాటు ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. గుంటూరులో వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాసం శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని పోలీస్ ఉన్నతాధికారులు అర్ధరాత్రి నుంచే టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ మోహరించారు. 

పోలీసు అధికారుల ఆదేశాలతో టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. ఛలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామన్న చంద్రబాబును పోలీసులు ఇల్లు కదలనీయలేదు. ఇంటిచుట్టూ మోహరించిన పోలీసులు లోపలికి టీడీపీ నేతలను వెళ్లనీయలేదు. ఆత్మకూరులో చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సును ఆత్మకూరు నుంచి తరలించారు. ఆత్మకూరుకు ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌ను అమరావతిలో పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్‌ను హౌస్ అరెస్టు చేశారు. 

 ఎటువంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని రాష్ట్ర డీజీపీ గౌత‌మ్ సావంగ్ తెలిపారు. ఛ‌లో ఆత్మ‌కూర్ ఆందోళ‌న చేప‌డుతున్న టీడీపీ నేత‌ల‌కు ఎటువంటి ప‌ర్మిష‌న్ లేద‌ని స్పష్టం చేశారు. టీడీపీ క్యాడ‌ర్‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న దాడుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని బాబు తెలిపారు. 

బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేదిలేద‌ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. మొన్నటివరకూ తన ఇంటిదగ్గర 144 సెక్షన్ అమలు చేశారు, నిన్నటి నుంచి పల్నాడులో.. ఈరోజు ప్రతి టిడిపి  నాయకుని ఇంటిముందు అమలు చేస్తున్నారు. ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్టకు అని లోకేశ్‌ త‌న ట్విట్ట‌ర్‌లో ధ్వజమెత్తారు.