పౌరుల హక్కుల పరిరక్షణకు నిబద్దతతో కృషి 

దేశంలోని ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరా నీ స్పష్టం చేశారు. జాతీయ పౌర రిజిస్ట్రీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించడాన్ని ఆమె తప్పు పట్టారు. అక్రమ వలసదారులపై చట్టప్రకారమే వ్యవహరిస్తామని, ఎన్‌ఆర్‌సీ వల్ల నిజమైన పౌరుల హక్కులకు ఎలాంటి విఘాతం కల గదని ఆమె వివరించారు. 

మమతా బెనర్జీ ధోరణి బట్టి చూస్తే అక్రమ వలసదారుల విషయంలో ఆమెకు ఓ స్పష్టమైన వైఖరి ఉన్నట్టుగా కనిపించడం లేదని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పథకాన్ని అమలు చేసినా దాని బాగోగులతో నిమిత్తం లేకుండా విమర్శించడమే పనిగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారని, ఈ వాస్తవం ప్రతిఒక్కరికీ తెలుసునని స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు. 

మమతా బెనర్జీ అనుసరిస్తున్న ఘర్షణ ధోరణి వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రాష్ట్రంలోని రైతులు, మహిళలు, పిల్లలకు అందకుండా పోతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతికూలత వల్ల ఎన్నో పరిశ్రమలు ఆగిపోయాయని పేర్కొన్న స్మృతి ఇరానీ రాష్ట్రంలో మార్పు రావాలని లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారని పేర్కొన్నారు.