అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం 

తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ విమోచన కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్ర ప్రదర్శనను మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రారంభించారు. 

కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, గరికపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలొన్న బైరాన్‌పల్లి గ్రామస్తులను ఈ సందర్భంగా సన్మానించారు. 

మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకుండా ప్రజలను దగా చేశారని ఆరోపించారు. మహారాష్టల్రోని ఐదు జిల్లాల్లో, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని వివరించారు.

ఉమ్మడి ఏపీలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని అప్పటి ప్రభుత్వాలను ఎంత డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఈనెల 17న గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ పతాకాన్ని ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. రజాకార్లను వ్యతిరేకించిన వారినే కాదు, మలిదశ తెలంగాణ ఉద్యమ కారులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జమ్మూకాశ్మీకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టుగానే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మజ్లీస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ త్యాగధనులను, చరిత్రను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను పాఠ్యంశంగా చేర్చాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ విమోచన దినం నిర్వహణ విషయంలో కాంగ్రెస్ విధానానే్న టీఆర్‌ఎస్ అనుసరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార ధోరణికి అంతం పలికే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన జోస్యం చేశారు.