అరుణ్ జైట్లీ ఓ అమూల్య వజ్రం...స్ఫూర్తిదాయకం 

భిన్న రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ అమూల్య వజ్రమని ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. దేశం కోసం మరింతగా కష్టపడేందుకు జైట్లీ జీవితమే తమకు స్పూర్తి అని ఢిల్లీలోజరిగిన ఓ సభలో మోదీ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా జైట్లీని ఈ సందర్భంగా నివాళి అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ‘జైట్లీ నాకు అత్యంత సన్నిహితమైన ఆప్తమిత్రుడు, ఆయన లేని లోటు నాకు నిత్యం గుర్తు వస్తూనే ఉంటుంది’ అని అన్నారు. అనేక రంగాల్లో జైట్లీ విశిష్ట ప్రతిభను చాటుకున్న ప్రజ్ఞాశాలి అని, న్యాయకోవిధుడని, క్రీడల్లో కూడా ఎంతో ఆసక్తి కనబరిచే వారని మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు జైట్లీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.

తన కంటే చిన్నవాడైన ఓ మంచి స్నేహితునికి నివాళి అర్పించే పరిస్థితి తనకు రావడం దురదృష్టకరమని చెప్పారు. అనేక రంగాల్లో జైట్లీకి ఎంతో ప్రతిభ ఉండేదని, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేవారని శ్రద్ధాంజలి సభలో మోదీ తెలిపారు. జైట్లీ ఏ పని చేసినా దానికో అర్థంతో పాటు విలువ కూడా ఉండేదని తన మంత్రివర్గ సభ్యుడిగా తనకు ఎన్నో విధాలుగా విలువైన సమాచారాన్ని అందించే వారని మోదీ గుర్తు చేసుకున్నారు. 

పార్లమెంటరీ, ప్రభుత్వాల చరిత్రకు సంబంధించి లోతైన అవగాహన ఉండడం వల్లే జైట్లీ తనకు విధి నిర్వహణలో ఎంతో సహకరించే వారని మోదీ తెలిపారు. జైట్లీ లేని లోటు తనను నిత్యం వెంటాడుతూనే ఉంటుందని పేర్కొన్న మోదీ ఆయన్ను ఓ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొన్నారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక పత్రాలు రూపొందించాల్సి వచ్చినప్పుడు ఇటు అద్వానీని లేదా జైట్లీనే పార్టీ నాయకత్వం సంప్రదించేదని మోదీ తెలిపారు. 

తనకు దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నా దాని గురించి మాట్లాడే వారు కాదని అప్పటి కీలక విషయాల గురించి వాటిని ఎలా ఎదుర్కొవాలన్న అంశాలపైనే ఆసక్తి కనబరిచే వారని మోదీ తెలిపారు. జైట్లీ చనిపోయినప్పుడు తాను భారత్‌లో లేనందున ఆయనకు తుది నివాళి అర్పించలేకపోయానని బాధతో అన్నారు. ఈ బాధ తనను నిత్యం వెన్నాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. 

పార్టీ సమావేశాల సమయంలో జైట్లీ తాను ఒకే రూంలో ఉండేవాళ్ళమని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పటికే ఫైవ్ స్టార్ హోటల్‌లోనే బస చేయగలిగే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ జైట్లీ మాత్రం పార్టీ ఏర్పాటు చేసిన వసతిలోనే ఇతర సహచరులతో కలిసి ఉండేవారని మోదీ తెలిపారు. 

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి, ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్, సీపీఐ నాయకుడు డి. రాజా ఈ శ్రద్ధాంజలి సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ జైట్లీ మరణం తనకు తీరని వ్యక్తిగత నష్టమని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతగానే ఆదుకున్నారని, ధైర్యాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. తాను బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్నప్పుడు న్యాయ సలహాల కోసం జైట్లీనే సంప్రదించే వాడినని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు. జైట్లీకి అద్భుతమైన సమయస్పూర్తి ఉండేదంటూ కొన్ని సంఘటనలను కాంగ్రెస్ నాయకుడు సింఘ్వి ఈ సందర్భంగా వెల్లడించారు.